COVID19: తగ్గిన సరఫరా... ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు!

Essential Prices Sky Rocketing Amid another Lockdown Fear
  • ప్రజల్లో మరోమారు లాక్ డౌన్ తప్పదన్న భయాలు
  • నూనెలు, పప్పులకు అమాంతం పెరిగిన డిమాండ్
  • ఆలస్యం అవుతున్న ఆన్ లైన్ డెలివరీలు

దేశంలో కరోనా నిబంధనల అమలు, మరోమారు లాక్ డౌన్ తప్పదేమోనన్న భయాలు, పప్పు దినుసులు, వంట నూనెలు, బియ్యం, శానిటైజర్లు, మాస్క్ లు, ఆక్సీమీటర్లు తదితరాలకు డిమాండ్ ను పెంచడంతో వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ లు అమలవుతూ ఉండటంతో, వస్తు ఉత్పత్తుల సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, పలు రకాల ఉత్పత్తుల లభ్యత మెరుగ్గానే ఉన్నప్పటికీ, ధరలు అధికంగా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

తమకు నిత్యావసరాల డెలివరీలు ఆలస్యం అవుతున్నాయని ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని ప్రజలు వాపోతున్నారు. కిరాణా స్టోర్లలో పూర్తి స్థాయిలో పనివారిని రప్పించే పరిస్థితులు లేవని, దీంతో ముందుగా ఆర్డర్ తీసుకున్న సరుకుల డెలివరీలను కూడా రద్దు చేసుకోవాల్సి వస్తోందని ముంబై, అంధేరీ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి వ్యాఖ్యానించారు. హోమ్ డెలివరీలను రాత్రి 8 గంటల వరకూ అనుమతిస్తున్నా, స్టోర్ టైమింగ్స్ మాత్రం ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ అమలవుతున్నాయని తెలిపారు.

గడచిన కొన్ని రోజులుగా కూరగాయలు, పండ్ల ధరలు కూడా పెరిగాయని న్యూఢిల్లీకి చెందిన నేహా గ్రోవర్ వ్యాఖ్యానించారు. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ కు ఆర్డర్లు వస్తున్నప్పటికీ, డెలివరీలను అందించేందుకు ఉద్యోగులు లభించడం లేదని అన్నారు. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో కొబ్బరి నీరు కూడా లభించే పరిస్థితి లేదని, మొన్నటి వరకూ రూ. 35 వరకూ ఉన్న కొబ్బరి బొండాం ధర, ఇప్పుడు 80 రూపాయలకు చేరిందని అన్నారు.

గ్లోఫర్స్ తో పాటు బిగ్ బాస్కెట్, అమెజాన్ తదితర ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థల డెలివరీలన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. డెలివరీ బాయ్స్ స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతులు లేకపోవడం కూడా ఇందుకు కారణమని బిగ్ బాస్కెట్ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News