Corona Virus: 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా: కేంద్రం తాజా నిర్ణయం

Centre allowed all above 18 to get vaccinated from may 1
  • దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ
  • కట్టడికి వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం
  • మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా
  • పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అంగీకరించిన కేంద్రం
దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించాలని నిర్ణయించింది. మే 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. నేడు వివిధ వర్గాలతో ప్రధాని మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ సమావేశాలు ముగిసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

దేశవ్యాప్తంగా కరోనా ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీన్ని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచించారు. ఈ క్రమంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపాలన్న డిమాండ్‌ వినిపించింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రులు ఈ దిశగా కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

అయితే, అందరికీ అందించేందుకు సరిపడా టీకాలు ప్రస్తుతం ఉన్నాయా? అన్నది అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే అనేక రాష్ట్రాలు టీకాలు లేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేశాయి. మరికొన్ని రాష్ట్రాలు పరిమిత సంఖ్య టీకాలతో నెట్టుకొస్తున్నాయి.
Corona Virus
Corona vaccine
Central Govt

More Telugu News