Hyderabad: ప్రేమించి పెళ్లాడి మరో యువతితో ప్రేమాయణం.. భార్యకు తెలవడంతో ఆత్మహత్య

young man suicide in Hyderbad
  • హైదరాబాద్ శివారులోని సైదాబాద్‌లో ఘటన
  • పెళ్లాడాలంటూ ప్రియురాలి నుంచి ఒత్తిళ్లు
  • ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తండ్రికి ఫోన్
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆ తర్వాత మరో యువతి ప్రేమలో పీకల్లోతులో కూరుకుపోయాడు. విషయం భార్యకు తెలియడంతోపాటు పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలి నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శివారులోని సైదాబాద్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. రెయిన్‌ బజార్‌కు చెందిన దీపక్ కుమార్ (18) హయత్‌ నగర్‌కు చెందిన యువతిని గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హయత్ నగర్‌లో ఉంటున్న అతడు ఇటీవల మరో యువతి ప్రేమలో నిండా మునిగాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో మనస్పర్థలు కలిగాయి. మరోవైపు, పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలి నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని పలుమార్లు స్నేహితులకు చెప్పుకుని బాధపడ్డాడు.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ కుమార్ తండ్రికి ఫోన్ చేసి ఎర్రకుంట సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పాడు. అప్రమత్తమైన తండ్రి కరణ్‌లాల్ వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే దీపక్ కుమార్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Love
Suicide
Telangana

More Telugu News