Suryapet District: దేవుడి పటాల ముందు ఆరు నెలల కుమార్తెను బలిచ్చిన తల్లి!

Woman Sacrifice her 6 month Old daughter In front of gods photos
  • సూర్యాపేట జిల్లాలో ఘటన
  • ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకూ సన్నద్ధమైన మహిళ
  • యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోల వీక్షణ
  • నాగదోషం ఉందని సాధువు చెప్పడంతో మరింత దిగజారిన మానసిక పరిస్థితి
బీఎస్సీ, బీఈడీ చదివి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమైన ఓ మహిళ మూఢభక్తితో తన ఆరేళ్ల బిడ్డను దేవుడి పటాల ముందు బలిచ్చింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతి బీఎస్సీ, బీఈడీ చదువుకుంది. ఉద్యోగాలకు కూడా సన్నద్ధమైంది. ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే, మనస్పర్థల కారణంగా కొన్ని రోజులకే విడిపోయారు.

అనంతరం పుట్టింటికి చేరుకున్న భారతి రెండేళ్ల క్రితం తండాకే చెందిన కృష్ణ అనే యువకుడిని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పెద్దలు వారి పెళ్లి చేయకతప్పలేదు. ఆరు నెలల క్రితం వీరికి కుమార్తె పుట్టింది.

కాగా, భారతి నిత్యం యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గడిపేది. తనను తాను శివుడిగా భావించేది. ఇటీవల గ్రామానికి ఓ సాధువు రాగా, ఆమెకు నాగదోషం ఉన్నట్టు చెప్పాడు. అప్పటి నుంచి భారతి మానసిక పరిస్థితి మరింత దిగజారింది. నిత్యం పూజలతోనే గడిపేది. భర్త నిన్న పనిమీద సూర్యాపేటకు వెళ్లగా, అత్తమామలు పొలం పనులకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన భారతి కుమార్తె రీతును దేవుడి పటాల ముందు పడుకోబెట్టి కత్తితో గొంతుకోసి హతమార్చింది.

అనంతరం పుట్టింటికి వెళ్లింది. ఒంటరిగా రావడంతో గమనించిన భారతి తల్లి కుమార్తె ఎక్కడని ప్రశ్నించింది. సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికెళ్లి చూడగా దేవుడి పటాల ముందు రక్తపు మడుగులో చిన్నారి విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Suryapet District
Woman
Sacrifice
Telangana

More Telugu News