Kerala: ముస్లిం మహిళలూ తలాఖ్​ చెప్పొచ్చు

Muslim Women Have Right To Invoke Extra Judicial Divorce Kerala High Court
  • కేరళ హైకోర్టు సంచలన తీర్పు
  • కోర్టుకు రావాల్సిన పనిలేదని వెల్లడి
  • కోర్టు బయటే విడాకులు తీసుకోవచ్చని తీర్పు
కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముస్లిం మహిళలు కోర్టుకు రావాల్సిన పనిలేకుండానే ఇస్లాం చట్టాల ప్రకారమూ విడాకులు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది. ఫ్యామిలీ కోర్టుల్లో పరిష్కారం కాని వివిధ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. కోర్టుకు రాకుండా విడాకులు తీసుకునే హక్కు ముస్లిం మహిళలకు లేదని 1972లో ‘కేసీ మోయిన్ వర్సెస్ నఫీసా తదితరులు’ కేసులో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది.

పవిత్ర ఖురాన్ ముస్లిం పురుషులు, మహిళలకు విడాకులు తీసుకునే విషయంలో సమాన హక్కులను కల్పించిందని జస్టిస్ ఎ. మహ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సీఎస్ దియాస్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తలాఖ్ ఈ తాఫీజ్, ఖులా, ముబారాత్, ఫస్క్ అనే నాలుగు పద్ధతుల విడాకులను ప్రస్తావించిన ధర్మాసనం.. వాటి ప్రకారం ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చని తీర్పునిచ్చింది.

‘‘షరియా చట్టం, ముస్లిం వివాహాల రద్దు చట్టాలను పరిశీలించాం. కోర్టుకు రాకుండా ‘ఫస్క్’ పద్ధతిలో ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవడాన్ని ముస్లిం వివాహాల రద్దు చట్టం నిరోధిస్తోంది. అయితే, షరియా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం అన్ని పద్ధతుల్లో ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చు. కాబట్టి, కేసీ మోయిన్ కేసులో నాటి ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం’’ అని పేర్కొంది.

వివాహ ఒప్పందాన్ని తుదివరకు పాటించని భర్తకు తలాఖ్ ఈ తాఫీజ్ ద్వారా భార్య విడాకులు ఇవ్వొచ్చు. ఖులా ప్రకారం భార్యే ఏకపక్షంగా భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు. పరస్పర ఆమోదంతో ముబారాత్ ద్వారా భర్త నుంచి భార్య విడిపోవచ్చు. ‘ఖాజీ’ అనే మధ్యవర్తుల ద్వారా ఫస్క్ పద్ధతిలో విడాకులను పొందవచ్చు.
Kerala
Talaq
Muslim Women
Muslim Laws
Shariat Act
Kerala High Court

More Telugu News