Madhya Pradesh: లాక్ డౌన్ విధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం!

Lockdown In Madhya Pradesh Urban Areas From 6 pm Tomorrow
  • అర్బన్ ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి లాక్ డౌన్
  • నగరాల గురించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం చౌహాన్
  • పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తిస్తున్నామని వ్యాఖ్య
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని అర్బన్ ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నగరాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. క్రైసిస్ మేనేజ్ మెంట్ గ్రూప్ తో సమావేశాన్ని నిర్ణయిస్తామని... ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తిస్తున్నామని తెలిపారు.

మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఉదయం హిందీలో ట్వీట్ చేస్తూ... ప్రజలకు హెచ్చరికలను జారీ చేసింది. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ కు గురికాకుండా చూసుకోవడమే రాష్ట్రానికి ప్రతి ఒక్కరూ చేసే అతి పెద్ద సేవ అని తెలిపింది. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్ లో 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.18 లక్షల కేసులు నమోదయ్యాయి.
Madhya Pradesh
Lockdown
Corona Virus

More Telugu News