: బెట్టింగ్ లో అంచెలంచెలుగా ఎదిగిన గురునాథ్

స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు.. గురునాథ్ మెయ్యప్పన్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ అల్లుడైన గురునాథ్.. మామ స్వంత ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కు సీఈఓగా ప్రాచుర్యంలో ఉన్నాడు. అయితే, ఐపీఎల్ అక్రిడిటేషన్ లో గురునాథ్ ను చెన్నై ఫ్రాంచైజీకి యజమానిగా పేర్కొనడం గమనార్హం. ఇక, బాలీవుడు నటుడు విందూ సింగ్... ఫిక్సింగ్ స్కాంలో అరెస్టవడంతో తొలిసారిగా గురునాథ్ విషయం వెలుగులోకి వచ్చింది.

విందూ వెల్లడించిన విషయాలను పరిశీలిస్తే.. గురునాథ్ 2011 నుంచి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. తొలుత మ్యాచ్ కు రూ.10 లక్షల పందెం కాసే స్థాయి నుంచి మ్యాచ్ కు ఏకంగా కోటి రూపాయలు బెట్టింగ్ కు పాల్పడే స్థాయికి ఎదిగాడు. విందూ సింగ్ ను అడ్డంపెట్టుకుని పందాలు కాసే గురునాథ్ తాజా ఐపీఎల్ సీజన్ లో స్వంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్ లతో పాటు పలు ఇతర జట్ల మ్యాచ్ లపైనా బెట్టింగ్ కు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసు వర్గాలు అంటున్నాయి.

కాగా, తన అల్లుడు ఫిక్సింగ్ స్కాంలో చిక్కుకోవడంతో రాజీనామా డిమాండ్లను ఎదుర్కొంటున్న బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్.. గురునాథ్ అరెస్టయితే పదవికి గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో షికారు చేస్తున్నాయి.

More Telugu News