India: ఐపీఎల్ లీగ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ ను వదిలేస్తారా?... షాహిద్ అఫ్రిది మండిపాటు

Afridi Fires on South Africa Cricket Board
  • ఇటీవల ముగిసిన పాక్ - సౌతాఫ్రికా వన్డే సిరీస్
  • వెంటనే ఐపీఎల్ కు వెళ్లేందుకు ఆటగాళ్లకు అనుమతి
  • సిరీస్ మధ్యలోనే వదిలేస్తున్నారని అఫ్రిది మండిపాటు
సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో 2-1 తేడాతో విజయం సాధించిన పాక్ జట్టు, తదుపరి సిరీస్ కు సిద్ధమవుతున్న వేళ, తమ దేశపు జట్టులోని పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ పోటీల నిమిత్తం ఇండియాకు వెళ్లేందుకు క్రికెట్ సౌతాఫ్రికా అంగీకరించింది.

అయితే, ఐపీఎల్ వంటి దేశవాళీ లీగ్ కోసం అత్యధిక ఆటగాళ్లను రిలీజ్ చేయడంపై పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మండిపడ్డాడు. జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్లుగా పేరున్న క్వింటన్ డికాక్, కసిగో రబాడా సహా పలువురు ఐపీఎల్ కోసం ముందుగానే అనుమతి తీసుకుని ఉండటంతో వారిని సీఎస్ఏ విడుదల చేసింది.

దీనిపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన అఫ్రిది, "సీఎస్ఏ అధికారులు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరిచింది. ఓ సిరీస్ మధ్యలో ఉండగా, ఐపీఎల్ వంటి టోర్నీలో ఆడేందుకు ఆటగాళ్లను పంపుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ను టీ-20 లీగ్ లు శాసిస్తున్నాయి. ఈ విషయమై పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ట్వీట్ చేశాడు. సిరీస్ విజయంపై తమ జట్టుకు అభినందనలు తెలుపుతూ, ఫఖర్ జమాన్, బాబర్ ఆజామ్ వంటి ఆటగాళ్లు మరోసారి తమలోని సత్తాను చాటారని అన్నారు.
India
Pakistan
South Africa
Cricket
IPL

More Telugu News