Vaishnav Tej: 'ఉప్పెన'లోని 'జల జల జలపాతం' సాంగ్ ఇలా తీశారబ్బా!
- విభిన్న ప్రేమకథా చిత్రంగా ఉప్పెన
- అద్భుతమైన పాట చిత్రీకరణ
- అనుభూతిని అందించే సంగీతం
- ప్రేక్షకుల మనసుకి పట్టేసిన పాట
ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'ఉప్పెన' పతాకస్థాయిలో నిలబడింది. ప్రేమ గాఢత ... ప్రేమికుల భావజాలాన్ని పాటల రూపంలో అందంగా ఆవిష్కరించిన తీరు యూత్ కు విపరీతంగా నచ్చేశాయి. వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీసు బద్దకాన్ని వదిలించేశాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ముఖ్యంగా శ్రీమణి సాహిత్యాన్ని అందించిన 'జలజల జలపాతం ..'సాంగ్ విశేషమైన ఆదరణ పొందింది.
తెరపై ఈ పాట నడుస్తున్నప్పుడు ప్రేక్షకులు కనురెప్పలు వేయడం మరిచిపోయారు. అంతటి అందంగా .. అద్భుతంగా చిత్రీకరించారు. సముద్రం మధ్యలో పడవ .. పడవలో ప్రేమికులు .. వెన్నెల రాత్రి ... ఎవరూ లేని ఏకాంతం .. పడవ తప్ప పట్టించుకునేవారు లేని ప్రదేశం .. చుట్టూ కేరింతలు కొట్టే కెరటాలు .. ఈ నేపథ్యంలో సాగిన ఈ పాట కుర్రాళ్ల మనసులను కుదిపేసింది. ఆ పాటను ఎలా చిత్రీకరించారనే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా మేకింగ్ వీడియోను వదిలారు. సినిమాలో ఆ పాటను చూసినవారికి, ఈ మేకింగ్ వీడియో గమ్మత్తుగా అనిపించడం ఖాయం.