Dharmendra Pradhan: పెట్రోలు రేట్లు మరింతగా తగ్గుతాయి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Petrolium Minister Says Price May Come Down Further
  • ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
  • కోల్ కతాలో ప్రచారం చేసిన ధర్మేంద్ర ప్రధాన్
  • వంట గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయని వెల్లడి
  • అంతర్జాతీయ మార్కెట్ ధరపై ఆధారపడ్డామని వ్యాఖ్య
ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రేట్లను తగ్గించడం ప్రారంభించాయని, సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింతగా తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ, కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన్, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయని, ఆ ప్రభావం ఇండియా పైనా ఉందని అన్నారు.

కాగా, ఫిబ్రవరి 27న ఎలక్షన్ కమిషన్ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించగానే, పెట్రోలు ధరల పెరుగుదలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై 61 పైసలు, డీజిల్ పై 60 పైసల మేరకు ధరను తగ్గించాయి. దాని తరువాత 14.2 కేజీల వంట గ్యాస్ ధరను రూ.10 మేర తగ్గించిన సంగతి తెలిసిందే.

"గత కొన్ని రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం ప్రారంభించాయి. మేము ఈ విషయాన్ని ముందే వెల్లడించాం. ఇంటర్నేషనల్ మార్కెట్ ను అనుసరించి ధరలు మారుతుంటాయి. ధరలు తగ్గే కొద్దీ ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తాం. వంట గ్యాస్ ధరలు కూడా రానున్న రోజుల్లో మరింతగా తగ్గుతాయి" అని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికలు వచ్చినందునే ఓట్ల కోసం బీజేపీ ప్రభుత్వం ధరలను తాత్కాలికంగా తగ్గిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇక ఇండియాలో అతిపెద్ద ఇంధన రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో మార్చి రెండో వారం నుంచి ధరల తగ్గుదల ప్రారంభమైంది. కరోనా కేసుల సంఖ్య యూరప్, ఆసియాలతో పాటు పలు దేశాల్లో పెరుగుతున్న వేళ ముడి చమురు ధరలపై ఒత్తిడి పెరిగింది.
Dharmendra Pradhan
Petrol
Price
Reduce

More Telugu News