Trinamool: ప్రధాని మోదీపై తృణమూల్​ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు

Street Side Fellow Trinamool MP Mahua Moitra Fires On PM Didi O Didi Digs
  • వీధి జులాయి అంటూ మండిపాటు
  • ప్రధాని 'దీదీ ఓ దీదీ' కామెంట్లపై ఫైర్
  • సిట్టింగ్ సీఎంపై అలాంటి కామెంట్లు చేస్తారా? అని నిలదీత
  • తన తల్లి, చెల్లి, భార్య గురించీ అలాగే మాట్లాడతారా? అని కామెంట్
ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వీధులెంట తిరిగే జులాయి’ అంటూ వ్యాఖ్యానించింది. బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ‘దీదీ ఓ దీదీ’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మహువా.. ‘వీధి జులాయి’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.

‘‘మేం బెంగాల్ లో ‘రాకేర్ ఛెలె’ అని అంటూ ఉంటాం. గోడ మీద కూర్చుని వచ్చిపోయే ఆడవాళ్లను ‘దీదీ ఏ దీదీ’ అంటూ టీజ్ చేసే వీధి జులాయిలు అని అర్థం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అచ్చం అలాగే చేస్తున్నారు’’ అని అన్నారు. ‘‘ఓ సిట్టింగ్ ముఖ్యమంత్రి గురించి ఇలాగేనా మాట్లాడేది? ‘దీదీ ఓ దీదీ’ అంటూ మాట్లాడతారా ఎవరైనా? వాళ్ల అమ్మ గురించి అలాంటి కామెంట్లే చేస్తారా? తన చెల్లెలి గురించి అలాగే మాట్లాడతారా? విడిపోయిన భార్యపైనా అవే వ్యాఖ్యలు చేస్తారా? ఎవరి గురించైనా అలాగే అంటారా? ఇవేనా ప్రధాని వచ్చి మాకు చెప్పే నీతులు? పద్ధతి గురించి మాకు చెబుతారా? ఓ ముఖ్యమంత్రి గురించి ప్రధాని ఇంత నీచంగా ఎలా మాట్లాడగలరు?’’ అంటూ ఆమె మండిపడ్డారు.

రెండో సీటు నుంచి పోటీ చేస్తున్నారా? అన్న నరేంద్ర మోదీ ప్రశ్నకూ మహువా బదులిచ్చారు. ‘‘రెండో సీటు నుంచి పోటీ చేస్తున్నారా? మమత బెనర్జీని ప్రధాని అడిగిన ప్రశ్న. అవును, ప్రధాని గారూ. ఆమె పోటీ చేస్తున్నారు. అయితే, అది మీ వారణాసి నుంచే. కాబట్టి వెళ్లి సమరానికి సిద్ధమవ్వండి’’ అంటూ వ్యాఖ్యానించారు.
Trinamool
West Bengal
Mahua Moitra
Prime Minister
Narendra Modi
Mamata Banerjee

More Telugu News