భారత్ నుంచి పంచదార, పత్తి దిగుమతులపై నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్

Pakistan removes ban on imports from India
  • తాజా ఉత్తర్వులు జారీ చేసిన పాక్ సర్కారు
  • భారత ఉత్పత్తుల కొనుగోళ్లకు పాక్ వ్యాపారుల సంప్రదింపులు
  • 2019లో కశ్మీర్ కు ప్రతిపత్తి తొలగించిన భారత్
  • అప్పట్నించి భారత్ తో సంబంధాలు తెంచుకున్న పాక్
  • ఇటీవల వరుసగా చర్చలు.. మారుతున్న పాక్ వైఖరి
  భారత్ నుంచి పంచదార, పత్తిని దిగుమతి చేసుకునేందుకు తమ దేశంలోని ప్రైవేటు రంగంకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. తద్వారా, చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు మొగ్గు చూపింది.

ఇటీవల భారత్, పాక్ మధ్య వివిధ స్థాయుల్లో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. కశ్మీర్ అంశంపై తాము చర్చల మార్గాన్నే కోరుకుంటున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి నిన్న లేఖ రాశారు. చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారానికి అనువైన మార్గం ఏర్పడుతుందని ఇమ్రాన్ పేర్కొన్నారు.

కాగా ఆ లేఖ రాసిన మరుసటి రోజే పాక్ కీలక నిర్ణయం తీసుకుని భారత ఉత్పత్తుల దిగుమతికి మార్గం సుగమం చేసింది. తాజా అనుమతుల ప్రకారం... భారత్ నుంచి 0.5 మిలియన్ టన్నుల పంచదార దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో పాక్ వ్యాపారులు ఇప్పటికే భారత్ లో పంచదార, పత్తి కొనుగోళ్లపై సంప్రదింపులు ప్రారంభించారు. ఇతర దేశాలతో పోల్చితే పత్తి, పంచదార భారత్ లోనే చవక అని పాక్ వ్యాపారులు భావిస్తున్నారు.

2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగిస్తూ భారత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత, పాక్ అన్ని వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని పాక్ చొరవ చూపడమే కాకుండా, పక్కాగా అమలు చేస్తోంది. దాంతో దాయాదుల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న ఆశలు చిగురిస్తున్నాయి.
Go Back to Shorts
Pakistan
Ban
Removal
Sugar
Cotton
Import
India

More Telugu News