OCI: ఓసీఐ కార్డుదారులకు భారీ ఊరటనిచ్చిన కేంద్రం!

OCI card holders no longer required to carry old passports for India travel diaspora welcomes move

  • పునరుద్ధరణ గడువు డిసెంబర్ 31 వరకు పెంపు
  • ప్రయాణ సమయంలో పాత పాస్ పోర్టులు అక్కర్లేదు
  • కొత్త పాస్ పోర్టులు మాత్రం తప్పనిసరి
  • కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్

విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయులు (ఓసీఐ– ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) ఇంతకుముందు.. భారత్ కు రావాలనుకుంటే పాత పాస్ పోర్టులను విధిగా వెంట తీసుకురావాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

ఇకపై పాత పాస్ పోర్టులను తీసుకురావాల్సిన అవసరం లేదంటూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గడువు తీరిన పాస్ పోర్ట్ ను తీసుకురావాల్సిన పనిలేదని, పునరుద్ధరించుకున్న కొత్త పాస్ పోర్టులను తీసుకొస్తే సరిపోతుందని వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న భారతీయులకు ప్రభుత్వం ఓసీఐ కార్డును ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓసీఐ కార్డున్న వారు ఓటు హక్కు, ప్రభుత్వ సేవలు, వ్యవసాయ భూముల కొనుగోలు తప్ప మిగతా అన్ని హక్కులూ పొందేందుకు వీలు కల్పిస్తారు. వీసా లేకుండానే అమెరికా నుంచి భారత్ కు రావొచ్చు. అయితే, గడువు తీరిన, వాటిని రెన్యువల్ చేసుకున్న కొత్త పాస్ పోర్టులను తప్పనిసరిగా వెంట తీసుకుతెచ్చుకోవాలన్న నిబంధన ఉండేది.

అయితే, ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తూ మార్చి 26న అమెరికాలోని భారత దౌత్యకార్యాలయాలు నోటిఫికేషన్ ను విడుదల చేశాయి. ఓసీఐ కార్డుల పునరుద్ధరణ గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. ఇక, ఇండియాకు వచ్చే ముందు పాత పాస్ పోర్ట్ నంబర్ ఉంటే సరిపోతుందని, వాటిని తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపాయి.

అయితే, కొత్త పాస్ పోర్టును మాత్రం తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించాయి. కాగా, ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓసీఐ కార్డుదారులందరికీ భారీ ఊరటనిచ్చే విషయమని ఓసీఐ కార్డుదారుల కోసం పోరాడుతున్న స్వచ్ఛంద కార్యకర్త ప్రేమ్ భండారీ అన్నారు.

  • Loading...

More Telugu News