Hafeezpet: హఫీజ్ పేట్ లోని ఆ 140 ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తులవే: తెలంగాణ హైకోర్టు తీర్పు

140 acres of Hafeezpet lands belongs to private persons says Telangana High Court
  • ఆ భూములు ప్రభుత్వానివి, వక్ఫ్ బోర్డువి కాదు
  • ప్రవీణ్ రావు, సహ యజమానుల పేరిట 50 ఎకరాలు నమోదు చేయండి
  • పిటిషనర్లకు రూ. 4 లక్షలు చెల్లించండి
హైదరాబాదులోని హఫీజ్ పేట్ సర్వే నంబర్ 80లోని వివాదాస్పద 140 ఎకరాల భూములపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ భూములు ప్రభుత్వానివి, వక్ఫ్ బోర్డువి కాదని స్పష్టం చేసింది. ఆ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినవని తెలిపింది.

ఆ భూములు తమవేనంటూ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్ రావుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘకాలం పాటు విచారణ చేపట్టిన హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ఆ భూమిలో 50 ఎకరాలు ప్రవీణ్ రావు, సహ యజమానుల పేరిట నమోదు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లకు రూ. 4 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ భూములకు సంబంధించిన వివాదంతోనే ప్రవీణ్ రావుతో పాటు మరికొందరిని కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ తదితరులపై కేసు నమోదైంది. అఖిలప్రియ అరెస్టై, కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. మరోవైపు, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Hafeezpet
Lands
TS High Court

More Telugu News