Delhi: ఢిల్లీ ఆసుపత్రిలో అద్భుతం.. 30 ఏళ్లుగా నోరు తెరవని అమ్మాయి మాట్లాడింది!

A Medical Miracle in sir Ganga ram Hospital
  • ఈ అనూహ్య ఘట్టానికి వేదికైన సర్‌ గంగారామ్‌ ఆస్పత్రి
  • దవడ ఎముకలు పుర్రె ఎముకకు అతుక్కోవడంతో నోరు తెరవలేని స్థితి
  • ఇన్నాళ్లూ ద్రవ ఆహారంతోనే జీవనం
  • సీనియర్‌ ప్లాస్టిక్ సర్జన్‌ రాహుల్‌ అహుజా నేతృత్వంలో సర్జరీ
  • ప్రస్తుతం 3 సెం.మీ మేర తెరుచుకున్న నోరు
వైద్య చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టానికి ఢిల్లీలోని సర్‌ గాంగారామ్‌ ఆసుపత్రి  వేదికైంది. పుట్టుక నుంచి నోరు తెరవని ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె సమస్యను పరిష్కరించారు అక్కడి వైద్యులు. ఇన్నాళ్లు ఉన్న సమస్య నుంచి బయటపడడంతో ఆమెకు ఇప్పుడు మాట్లాడే అవకాశం కలిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఆస్తా మోంగియా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. పుట్టుకతోనే ఆమె నోరు తెరవలేని పరిస్థితిలో ఉన్నారు. నోరు తెరవగలిగితే మాటలు వచ్చే అవకాశం ఉంది. నోటిలోని దవడ ఎముకలు పుర్రె ఎముకతో అతుక్కుపోయాయి. దీంతో నోరు తెరవలేని పరిస్థితి. ఇక ఘనపదార్థాలను తినే అవకాశమూ ఉండేది కాదు. దీంతో ఇన్నాళ్లు ఆమె ద్రవ ఆహారంపైనే జీవించారు. ప్రస్తుతం దంతాలు సైతం క్షీణించే దశకు చేరుకున్నాయి.

దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం ఆస్తా భారత్‌లోని ప్రముఖ ఆసుపత్రులలో పాటు దుబాయ్‌, యూకేలోని  వైద్యులనూ సంప్రదించారు. ప్రతిచోటా ఆమెకు నిరాశే ఎదురైంది. చివరకు గంగారామ్‌ ఆస్పత్రిలోని ప్లాస్టిక్, కాస్మొటిక్‌ సర్జరీ విభాగంలోని సీనియర్‌ ప్లాస్టిక్ సర్జన్‌ రాహుల్‌ అహుజా ఈ కేసును తీసుకోవడానికి అంగీకరించారు.

తన బృందంతో కలిసి అహుజా మూడు వారాల ముందు నుంచే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. చివరకు ఈ నెల 20న ఆపరేషన్‌ నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించారు. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించింది. ఆస్తా నోరును 2.5 సెం.మీ మేర తెరుచుకునేలా చేశారు. ఐదు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన ఆస్తా.. రోజూ కొన్ని నోటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం మొదలుపెట్టింది.

 దీంతో ఆమె నోరు ప్రస్తుతం మూడు సెంటిమీటర్ల వరకు తెరుచుకుంటోంది. మరికొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగిస్తే మరింత తెరుచుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. వైద్యులు తనకు పునర్జన్మను ప్రసాదించారంటూ ఆస్తా ఆనందం వ్యక్తం చేస్తోంది. కన్నీటితో వారికి మనసారా ధన్యవాదాలు తెలిపింది.
Delhi
Sir Ganga Ram hospital
Rajeev Ahuja

More Telugu News