Ambati Rambabu: టీడీపీది ఆవిర్భావం కాదు.. అంతర్ధాన దినోత్సవం: అంబటి

  • ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలోకి విషసర్పంలా చంద్రబాబు ప్రవేశించాడు
  • ఈ విషయాన్ని యువత తెలుసుకోవాలి
  • సంక్షేమ పథకాలు ఆగకూడదనేదే వైసీపీ లక్ష్యం
Chandrababu entered into TDP like a snake says Ambati

టీడీపీ నేతలు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, అది పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదని... అంతర్ధాన దినోత్సవమని అన్నారు. సూర్యోదయాన జరుపుకోవాల్సిన వేడుకలను సూర్యాస్తమయ సమయంలో జరుపుకున్నారని... టీడీపీకి పుట్టగతులు లేవనే విషయం దీంతో అర్థమవుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు టీడీపీలోకి ఎలా వచ్చారో యువత తెలుసుకోవాలన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలోకి ప్రవేశించిన విషసర్పం చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తొమ్మిది నెలల్లోనే రాజకీయశక్తిగా ఎదిగి తిరుగులేని పాలన చేసిందని అంబటి అన్నారు. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు ప్రవేశించినట్టుగా చంద్రబాబు ఆ పుట్టలోకి ప్రవేశించి, పార్టీని ఆక్రమించుకున్నారని చెప్పారు. టీడీపీ బతికి బట్టకట్టడం సాధ్యం కాదని... వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా ఉండరని అన్నారు. ఎన్టీఆర్ కుమారులకు పౌరుషం ఉంటే... పార్టీని చంద్రబాబు నాశనం చేయకుండా కాపాడేవారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం 11 నెలల్లో రూ. 79,191 కోట్ల అప్పులు చేసిందని పత్రికలో వార్త రాగానే చంద్రబాబు దాన్ని భుజాన పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో కరోనా సమయంలో కూడా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. దీన్నంతా ప్రజలు గమనించారు కాబట్టే... పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి పట్టంకట్టారని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు కూడా చంద్రబాబుకు లేదని అన్నారు.

More Telugu News