Bandipur: పిల్లలను వదిలేసిన పులి.. ఆకలితో అలమటించి పులికూనల మృత్యువాత

3 tiger cubs die of starvation in Bandipur
  • మైసూరులోని బండీపుర అభయారణ్యంలో ఘటన
  • మూడు పులికూనల మృత్యువాత
  • బతికున్న ఒకదానికి మైసూరు జూలో చికిత్స
  • తల్లిపులి కోసం గాలింపు
తల్లి వదిలి వెళ్లిపోవడంతో ఆహారం లేక ఆకలితో అలమటించిన మూడు పులి కూనలు మృత్యువాత పడ్డాయి. మైసూరులోని బండీపుర అభయారణ్యంలో జరిగిన ఈ ఘటన అటవీ అధికారులను కలచివేసింది. అడవిలో గస్తీ తిరుగుతున్న సిబ్బందికి నిన్న దాదాపు నెలన్నర వయసున్న మూడు పులి పిల్లలు కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూసిన సిబ్బంది అందులో ఒకటి చనిపోయినట్టు గుర్తించారు. మిగతా రెండూ ఆకలితో అలమటిస్తూ శుష్కించిన స్థితిలో ఉన్నాయి.

తల్లి వదిలి వెళ్లిపోవడంతో పాలు, ఆహారం లేక అవి అలమటించిపోయినట్టు గుర్తించిన అధికారులు వాటిని వెంటనే మైసూరుకు తరలించారు. ఈ క్రమంలో మరో కూన కూడా మృతి చెందింది. దీంతో మిగిలిన ఒక్క కూనకు ఆహారం అందించి చికిత్స చేపట్టారు. చనిపోయిన పులి పిల్లలకు నిర్వహించిన పోస్టుమార్టంలో ఆహారం లేకపోవడం వల్లే అవి మరణించినట్టు తేలింది.

మరోవైపు, పులి కూనలను గుర్తించిన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో నిన్న చనిపోయి పడి ఉన్న మరో పులి కూనను అధికారులు గుర్తించారు. అడుగుల జాడ ఆధారంగా తల్లి పులి కోసం గాలింపు చేపట్టినట్టు బండీపూర్ టైగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ఆర్ నటేశ్ తెలిపారు. పులి కూనలను గుర్తించిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
Bandipur
Mysore
Tiger Cubs
Starvation

More Telugu News