Holi: హిందువులకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!
- హోలీ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ట్వీట్
- మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న అసద్ కైజర్
- పాక్ లో 75 లక్షల మంది హిందువులు
హోలీ పర్వదినం సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పర్వదినం సందర్భంగా హిందువులందరికీ తన శుభాకాంక్షలని చెబుతూ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. పాకిస్థాన్ లో ఈ పర్వదినాన్ని ఆదివారం, సోమవారాల్లో జరుపుకుంటున్నారు.
ఇక పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ కైజర్ సహా పలువురు రాజకీయ నేతలు, హిందూ ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. పాకిస్థాన్ లోని హిందూ ప్రజలు దేశాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని ఈ సందర్భంగా అసద్ వ్యాఖ్యానించడం గమనార్హం. మైనారిటీల సంక్షేమానికి తాము పెద్దపీట వేస్తున్నామని, తమ పర్వదినాలన్నింటినీ బహిరంగంగా జరుపుకునే సౌలభ్యాన్ని దగ్గర చేశామని అన్నారు.
కాగా, పాకిస్థాన్ లో అతిపెద్ద మైనారిటీ వర్గంగా హిందువులు ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక అధికారుల లెక్కల ప్రకారం, పాక్ లో దాదాపు 75 లక్షల మంది హిందువులున్నారు. వేసవిలో వచ్చే హోలీ పర్వదినాన్ని ఇండియాతో పాటు నేపాల్ లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇటీవలి కాలంలో ఈ పండగ విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఉన్న హిందువులు హోలీని జరుపుకుంటున్నారు.