Congress: ఆ యువనేతతో జాగ్రత్తగా ఉండండి... లేదంటే ముంచేస్తారు: రాజ్‌నాథ్‌ సింగ్‌

Be careful with young leader says Rajnath Singh
  • కేరళలో ప్రచారం నిర్వహించిన రక్షణ మంత్రి
  • రాహుల్‌ గాంధీపై సెటైర్లు
  • గతంలో ఎంపీగా ఉన్న అమేథీ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శ
  • వయనాడ్‌నూ ముంచేస్తారని ఎద్దేవా
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఓ యువనేత పట్ల  జాగ్రత్తగా ఉండాలని.. ఆయన ట్రాక్‌ రికార్డ్‌ మంచిది కాదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మునిగిపోతారని.. ఇతరులను కూడా ముంచేస్తారని ఎద్దేవా చేశారు.  కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం త్రిశూర్‌లో బీజేపీ తరుఫున రాజ్‌నాథ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ యువనేత ఇటీవల కేరళ మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి దూకారని గుర్తుచేశారు.  

అమేథీ ప్రజలకు ఆ యువనేత గురించి బాగా తెలుసని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. వారిని అడిగితే ఆయన గురించి చెబుతారన్నారు. గతంలో ఆయన ఆ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారని.. ఇంకా ఆ ప్రాంతం వెనుకబడే ఉందన్నారు. ఇప్పుడు వయనాడ్‌ను ముంచేందుకు ఇక్కడికి వచ్చారని ఆరోపించారు.

కేరళలోని అధికార ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం, సీఎం విజయన్‌పైనా రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ ఒక్కటేనని, ఆ కూటముల నుంచి కేరళ విముక్తి పొందాలని అన్నారు.

మరోవైపు, వాతావరణం అనుకూలించక ఆయన ప్రయాణించిన విమానం ఆలస్యంగా ల్యాండ్‌ కావడంతో ఎర్నాకుళంలో బీజేపీ తలపెట్టిన రోడ్‌ షోను రద్దు చేశారు.
Congress
Rahul Gandhi
Kerala
rajnath singh
BJP

More Telugu News