Peddireddi Ramachandra Reddy: ఇసుక విధానంపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy hits out TDP leaders comments on sand policy
  • ఏపీలో ఇసుక తవ్వకాలు జేపీ గ్రూప్ సంస్థకు అప్పగింత
  • రెండేళ్లకు రూ.1,528 కోట్లు కోట్ చేసిన సంస్థ
  • టీడీపీ నేతల విమర్శలు
  • నష్టాల్లో ఉన్న సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ వ్యాఖ్యలు
  • రూ.20 కోట్ల ష్యూరిటీ చెల్లించిందన్న పెద్దిరెడ్డి
  • దివాళా తీసిన సంస్థ ఎలా అవుతుందని మండిపాటు
ఏపీలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు, రీచ్ ల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జేపీ గ్రూప్ నకు చెందిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కు అప్పగించడం తెలిసిందే. బిడ్డింగ్ లో జయప్రకాశ్ వెంచర్స్ సంస్థ రెండేళ్ల కాలవ్యవధికి గాను రూ.1,528 కోట్లు కోట్ చేసింది. దాంతో ఆ సంస్థకు ఇసుక కాంట్రాక్టు అప్పగించారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బదులిచ్చారు. నష్టాల్లో ఉన్న సంస్థకు ఇసుక తవ్వకాలు ఎలా అప్పగిస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండగా, పెద్దిరెడ్డి అదేస్థాయిలో స్పందించారు.

ఏపీ ఇసుక విధానంపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. టీడీపీ హయాంలో ఇసుకపై లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ (ఎంఎస్ టీసీ)తో టెండర్లు పిలిచి పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికే బిడ్డింగ్ ఇచ్చామని, అయినా మీరెందుకు టెండర్లలో పాల్గొనలేదని టీడీపీ నేతలను తిరిగి ప్రశ్నించారు. రూ.20 కోట్ల మేర ష్యూరిటీ చెల్లించాక కూడా జేపీ గ్రూప్ ఎలా దివాళా తీసిందవుతుందని నిలదీశారు.

ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. పునరావాస కాలనీలు, రీచ్ వద్ద ఉన్న గ్రామాలకు ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పారు.
Peddireddi Ramachandra Reddy
TDP Leaders
Sand Policy
Andhra Pradesh

More Telugu News