Atchannaidu: సీఎం జగన్ ప్రజారాజధానిపై పగబట్టారని మరోసారి సాక్ష్యాధారాలతో వెల్లడైంది: అచ్చెన్నాయుడు

AP TDP President Atchannaidu fires on CM Jagan
  • సీఎం జగన్ పై అచ్చెన్న విమర్శనాస్త్రాలు
  • కూలగొట్టడమే కానీ కట్టడం రాదంటూ వ్యాఖ్యలు
  • అమరావతిలో అవినీతిని నిరూపించలేకపోయారన్న అచ్చెన్న  
  • చివరికి ఫేక్ అస్త్రాన్ని బయటికి తీశారని ఆరోపణ
ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సీఎం జగన్ రెడ్డి, ఆయన ముఠా ప్రజారాజధానిపై పగబట్టారని మరోసారి సాక్ష్యాధారాలతో వెల్లడైందని తెలిపారు. కూలగొట్టడమే కానీ, కట్టడం రాని జగన్ రెడ్డి ప్రజావేదికతో ప్రారంభించి అమరావతి వరకు విధ్వంసం కొనసాగిస్తున్నారని విమర్శించారు.

22 నెలల పాలనలో ప్రజారాజధానిపై పదుల సంఖ్యలో విచారణలు వేయించిన సీఎం ఒక అక్రమం కానీ, ఒక్క రూపాయి అవినీతి జరిగింది అని కానీ నిరూపించలేకపోయాడని తెలిపారు. చివరికి తన డీఎన్ఏలో భాగమైన ఫేక్ ప్రచారాస్త్రాన్ని బయటికి తీశారని ఆరోపించారు.

మంగళగిరి ఎమ్మెల్యే కిరాయి మనిషి జాన్సన్ ను, వలంటీర్ అయిన కాపు మహిళని అసైన్డ్ దళిత రైతులంటూ సీఐడీకి ఇచ్చిన ఫేక్ ఫిర్యాదుల గుట్టును టీడీపీ రట్టు చేసిందని అచ్చెన్నాయుడు అన్నారు. సీఐడీకి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం, కోర్టులను తప్పుదోవ పట్టించడం వంటి ఈ కుట్రలకు పాత్రధారి ఎమ్మెల్యే ఆళ్ల రెడ్డి అని, సూత్రధారి సీఎం జగన్ రెడ్డి అని ఆరోపించారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Atchannaidu
Jagan
Amaravati
CID
Telugudesam
YSRCP

More Telugu News