Maharashtra: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ, సీఎం ఉద్ధవ్ థాకరే భార్యకు కరోనా!

CM Uddhav Thackerays wife Rashmi found Covid positive
  • ఈ నెల 11న సీఎంతో కలిసి టీకా తీసుకున్న రష్మీ థాకరే
  • రెండు రోజుల క్రితం కుమారుడు ఆదిత్యకు కరోనా
  • హోం ఐసోలేషన్‌లో సీఎం భార్య
ఈ నెల 11న కరోనా టీకా వేయించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా బారినపడ్డారు. దీంతో ఆమె వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. థాకరే దంపతులు ఈ నెల 11న ముంబైలోని జేజే ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. కాగా, రెండు రోజుల క్రితమే వారి కుమారుడు, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారినపడ్డారు.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతోంది. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 28,699 కొత్త కేసులు నమోదయ్యాయి. 132 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 2.12 శాతానికి పెరిగింది.

రాష్ట్రంలో పెరిగిపోతున్న వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. పలు జిల్లాల పరిధిలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తోంది. కరోనా కట్టడిలో ప్రజలు సహకరించాలని, అత్యవసరాలకు తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. లాక్‌డౌన్ విధించే పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరించింది.
Maharashtra
Uddhav Thackeray
Rashmi Thackeray
Corona Virus

More Telugu News