Work from Home: వర్క్‌ ఫ్రమ్‌ హోంపై మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం!

Microsoft is in thought of recalling Employess to Office
  • ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచే యోచనలో సాంకేతిక దిగ్గజం
  • మార్చి 29న తెరుచుకోనున్న ప్రధాన కార్యాలయం
  • వ్యాక్సినేషన్‌ ఊపందుకోవడమే కారణం
  • అయితే, నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలేసిన సంస్థ
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బడా సాంకేతిక సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. అయితే, తాజాగా దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి పాత విధానానికే రావాలని సంస్థలు యోచిస్తున్నాయి. అందులో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. తమ ఉద్యోగులందరినీ తిరిగి ఆఫీసులకు పిలవాలని భావిస్తోంది. ఇప్పటికే రెడ్‌మోండ్‌, వాషింగ్టన్‌లోని ప్రధాన కార్యాలయాన్ని మార్చి 29 నుంచి తెరవనున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌ ఆరోజు నుంచే ఉద్యోగులను కూడా ఆఫీసుల్లోకి అనుమతించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కుర్త్‌ డెల్‌బీన్‌ మైక్రోసాఫ్ట్‌ బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు. అమెరికాలోని రెడ్‌మోండ్‌, వాషింగ్టన్‌ సహా సంస్థ ప్రధాన కేంద్రాలకు ఉద్యోగులను తిరిగి రమ్మనాలని భావిస్తున్నట్లు తెలిపారు. అక్కడి స్థానిక ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేసేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని భావిస్తున్నామన్నారు. అయితే రావాలా? వద్దా? అనే విషయాన్ని ఉద్యోగుల అభీష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. అభ్యంతరాలు ఉన్నవారు ఇంటి నుంచి పని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. లేదా కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి కూడా సేవలు అందించవచ్చని స్పష్టం చేశారు.
Work from Home
Microsoft
coronavirus
America

More Telugu News