Swatmanandendra: ఆలయ భూములు కాజేసిన వారికి నాశనం తప్పదు: స్వాత్మానందేంద్ర
- దారుణ స్థితిలో గుళ్ల సీతారామపురం ఆలయం
- ఆలయాన్ని చూసి భావోద్వేగానికి గురైన స్వాత్మానందేంద్ర
- దేవాదాయ శాఖతో చర్చిస్తానని వ్యాఖ్య
ఒక దేవాలయం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గుళ్ల సీతారామపురం ఆలయం దారుణమైన స్థితిలో ఉండటాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఆయన ఈరోజు గుళ్ల సీతారామపురం వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ ఆలయానికి మూడు వేల ఎకరాలున్నా, పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని అన్నారు. ఆలయ పరిస్థితి ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు.
ఈ ఆలయ భూములను అన్యాక్రాతం చేసిన వారు నాశనమవక తప్పదని స్వాత్మానందేంద్ర స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూములను కాజేసిన వారు వెంటనే వాటిని ఆలయానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆలయ దుస్థితిపై దేవాదాయ శాఖతో చర్చిస్తామని చెప్పారు. ఆలయానికి శ్రీరామనవమి వేడుకల సందర్భంగా విశాఖ పీఠం నుంచి పట్టు వస్త్రాలను పంపిస్తామని తెలిపారు. సీతారాముల విగ్రహాలకు వెండి కిరీటాలు చేయిస్తామని చెప్పారు.