Mansoor Ali Khan: చెత్తకుండీ... పక్కనే వీధికుక్క!... తమిళ సినీ విలన్ వినూత్న ఎన్నికల ప్రచారం!

Actor Mansoor Ali Khan goes different style in election campaign
  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • ఏప్రిల్ 6న పోలింగ్
  • తొండముత్తూరు బరిలో నటుడు మన్సూర్ అలీఖాన్
  • ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ
  • తనదైన శైలిలో ప్రచారం
పలు డబ్బింగ్ చిత్రాల ద్వారానే కాకుండా, స్ట్రెయిట్ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటుడు మన్సూర్ అలీఖాన్. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మన్సూర్ అలీఖాన్ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరులోని తొండముత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ఓ చెత్తకుండీ వద్ద కూర్చున్న ఆయన పెన్ను, పేపరు పట్టుకుని సమస్యలుంటే తనకు నివేదించాలని ప్రజలను కోరుతున్నారు. ఆయన పక్కనే ఓ వీధి కుక్క కూడా ఉండడం చూపరులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, నేతలు ప్రజలను పట్టించుకోలేదని, హామీలపై మోసం చేశారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేను అయితే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇక ప్రచారంలో భాగంగా వాలీబాల్ ఆడడం, షాపుల వద్ద స్థానికులతో ముచ్చట్లాడడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అయితే, మన్సూర్ అలీఖాన్ పై కోయంబత్తూరులో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనారిటీ ఓట్లను చీల్చేందుకు ఓ పార్టీ తరఫున ఆయన డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దాంతో మనస్తాపం చెందిన మన్సూర్ అలీఖాన్ పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత లేదు. తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Mansoor Ali Khan
Election Campaign
Tamilnadu
Assembly Elections
Actor
Kollywood

More Telugu News