AR Rehman: తెరపైకి సంగీత మాంత్రికుడు రెహ్మాన్! ‌

AR Rehman to dance with Mohanlal for a Malayalam movie
  • మోహన్ లాల్ హీరోగా 'అరాట్టు' సినిమా 
  • సంగీతాన్ని సమకూరుస్తున్న రెహ్మాన్ 
  • రెహ్మాన్, మోహన్ లాల్ లపై పాట షూట్   
  • ఫొటో షేర్ చేసిన మోహన్ లాల్ 
దక్షిణాది సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఎటువంటి హిట్స్ ఇచ్చాడో మనకు తెలుసు. ఆయన పాటల వల్లే ఆయా సినిమాలు ఎంతగానో హిట్టయిన విషయం విదితమే. అంతేకాదు, ఒకవేళ సినిమా ఫ్లాపయినప్పటికీ ఆ సినిమా కోసం ఆయన ఇచ్చిన పాటలు మాత్రం హిట్టయిన సందర్భాలు కూడా వున్నాయి. అందుకే, తన తర్వాత ఎందరు సంగీత దర్శకులు వచ్చినా ఇంకా తన హవా ఆయన కొనసాగిస్తూనే వున్నాడు.

అలాంటి రెహ్మాన్ త్వరలో తెరపై తళుక్కుమననున్నాడు. అవును, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలసి ఆయన ఓ సినిమాలో నటిస్తున్నాడు. బి.ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా ప్రస్తుతం 'అరాట్టు' అనే మలయాళ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అంతేకాదు, ఇందులో మోహన్ లాల్ తో కలసి ఆయన ఓ పాటలో డ్యాన్స్ చేస్తున్నాడు.

ఇక ఈ పాటను నిన్నటి నుంచి చెన్నైలో స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ, మ్యూజిక్ మ్యాస్ట్రో రెహ్మాన్ తో షూటింగులో పాల్గొనడం గొప్ప అనుభవం అంటూ పోస్ట్ పెట్టారు. అలాగే ఆ సెట్లో దర్శకుడితో కలసి వీరిద్దరూ దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.
AR Rehman
Mohan Lal
Malayalam

More Telugu News