Sunil Gavaskar: సచిన్ తరహాలో విరాట్ కోహ్లీ ఇకపై ఓపెనర్ గా కొనసాగాలి: గవాస్కర్

Gavaskar suggests Kohli continue as opener for Team India
  • గతంలో సచిన్ ఓపెనర్ గా ఆడాడన్న గవాస్కర్
  • ఓపెనర్ గా మారిన తర్వాత సచిన్ ఆట మారిందని వెల్లడి
  • జట్టుకు కూడా బాగా లాభించిందని వివరణ
  • బెస్ట్ బ్యాట్స్ మెన్ ఓపెనర్ గానే ఆడాలన్న గవాస్కర్
ఇంగ్లండ్ తో చివరి టీ20లో ఓపెనర్ అవతారమెత్తిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ కోహ్లీ... మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి 94 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో నెగ్గిన టీమిండియా, సిరీస్ కూడా కైవసం చేసుకుంది. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.

గతంలో సచిన్ టెండూల్కర్  బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొచ్చి ఓపెనర్ గా ఆడాడని, ఆ స్థానంలో విశేషంగా రాణించాడని వెల్లడించారు. ఓపెనర్ గా వచ్చిన తర్వాత సచిన్ ఆటతీరు ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందేనని, ఆ మార్పు జట్టుకు కూడా ఎంతో లాభించిందని వివరించారు. ఇప్పుడు కోహ్లీ కూడా సచిన్ లాగానే ఓపెనర్ స్థానంలో ఆడాలని గవాస్కర్ సూచించారు. జట్టులో ఉన్న అత్యుత్తమ ఆటగాడు సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడేందుకు ఓపెనింగ్ స్థానం వీలు కల్పిస్తుందని తెలిపారు.

కాగా నిన్నటి మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, రాబోయే ఐపీఎల్ లోనూ తాను ఓపెనర్ గానే ఆడతానని వెల్లడించాడు. రోహిత్ శర్మ, కోహ్లీ జోడీ త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్ లోనూ ఇన్నింగ్స్ ఆరంభిస్తుందని తెలుస్తోంది.
Sunil Gavaskar
Virat Kohli
Opener
Sachin Tendulkar
Team India

More Telugu News