West Bengal: వారి నిజస్వరూపం తెలుసుకోలేకపోయా.. నేనో గాడిదను: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ

Mamata describes herself as a donkey for not knowing Suvendu Adhikaris originality
  • పశ్చిమ బెంగాల్‌లో భాజపా, తృణమూల్‌ మధ్య మాటల యుద్ధం
  • సువేందు అధికారిపై మమత తీవ్ర ఆరోపణలు
  • అధికారి కుటుంబ నిజస్వరూపం తెలుసుకోలేకపోయానని వ్యాఖ్య
  • రూ.5000 కోట్లతో సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణ
  • బీజేపీని రాష్ట్రానికి దూరంగా ఉంచాలని ఓటర్లకు పిలుపు
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ నేత సువేందు అధికారి కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు ఆ కుటుంబ నిజస్వరూపం తెలుసుకోలేకపోయానని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కాంతి దక్షిణ్‌ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సువేందు అధికారి కుటుంబం రూ.5 వేల కోట్లతో ఒక సామ్రాజ్యమే నిర్మించుకుందన్న విషయం తన దృష్టికి ముందే వచ్చిందని కానీ దాన్ని అప్పట్లో పట్టించుకోలేదని తెలిపారు. ఈసారి అధికారంలోకి వచ్చాక ఆ అంశంపై విచారణ జరిపిస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఆమె సువేందు కుటుంబాన్ని ద్రోహులుగా అభివర్ణించారు.

‘‘ఈ విషయంలో నాదే తప్పు. నేనో పెద్ద గాడిదను. వారి(సువేందు అధికారి కుటుంబం) నిజస్వరూపం తెలుసుకోలేకపోయా. వారు రూ.5000 కోట్లతో పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారని ప్రజలు చెప్పుకుంటారు. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓటర్లను కొనబోతున్నారు. అలాంటి వారికి ఓటేయకండి’’ అని ఓటర్లకు దీదీ విజ్ఞప్తి చేశారు. అధికారి కుటుంబం ఈ ప్రాంతాన్ని జమిందారుల్లా పాలిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకునే విషయంలో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్యం, రోడ్లు వంటివి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినవే తప్ప సువేందు కుటుంబం చేసినవి కాదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రం శాంతి సామరస్యాలతో, అభివృద్ధి బాటలో పయనించాలంటే బీజేపీని రాష్ట్రానికి దూరంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా ‘వందేమాతరం’, ‘జైహింద్‌’ అంటూ మమత నినాదాలు చేయడం గమనార్హం.
West Bengal
Mamata Banerjee
BJP
TMC

More Telugu News