Mamata Banerjee: మీ పోరాటం నా పోరాటం కూడా.. అందరి మద్దతు కూడగడతా: కేంద్రంపై నిప్పులు చెరుగుతూ కేజ్రీవాల్ కు మమత లేఖ

Mamata writes a letter to Kejriwal on National Capital Territory of Delhi Amendment Bill
  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలను పెంచే బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
  • సమాఖ్య వ్యవస్థపై ఇదొక సర్జికల్ స్ట్రయిక్ అన్న మమత
  • ఢిల్లీ ప్రభుత్వాన్ని బలహీనం చేసేందుకే అని వ్యాఖ్య
  • రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపాటు
  • లెఫ్టినెంట్ గవర్నర్ చేత ఢిల్లీని పాలించాలనుకుంటున్నారని ఆగ్రహం
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థపై ఇది ఒక సర్జికల్ స్ట్రయిక్ వంటిదని ఆమె అన్నారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మమత లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు, రాజకీయ పార్టీలకు తాను లేఖలు రాస్తానని చెప్పారు. ఈ బిల్లును అందరం కలసికట్టుగా ఎదుర్కొందామని కోరతానని తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వాన్ని పూర్తిగా బలహీనం చేసేందుకే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆమె పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలను కల్పించి, ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆయనకు సబార్డినేట్ లా తయారు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

ఈ విషయంలో కేజ్రీవాల్ కు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని మమత అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనం చేస్తూ, వాటిని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారు. లోక్ సభలో ప్రవేశపెట్టిన నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లు 2021ని సమాఖ్య వ్యవస్థపై సర్జికల్ స్ట్రయిక్ గా అభివర్ణించారు.

ప్రస్తుతం తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని... ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఢిల్లీకి వచ్చి కేజ్రీవాల్ ని కలిసి మద్దతు ప్రకటిస్తానని మమత చెప్పారు. 'మీ పోరాటం నా పోరాటం కూడా. మీరు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నా' అని కేజ్రీని ఉద్దేశించి అన్నారు.

 ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బీజేపీ తగ్గించే ప్రయత్నం చేస్తుండటం తనకు ఏ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదని చెప్పారు. 2014 మరియు 2019 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో బీజేపీ ఓడిపోవడాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేకపోయినా... వారికి చెందిన మరో ప్రతినిధి (లెఫ్టినెంట్ గవర్నర్) చేత ఢిల్లీని పాలించాలనుకుంటున్నారని విమర్శించారు.

లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో... ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అనే విధంగా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఏ కార్యనిర్వాహక చర్య తీసుకోవాలనుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పొందుపరిచారు. ఈ బిల్లు పాస్ అయి చట్టం రూపం దాలిస్తే... లెఫ్టినెంట్ గవర్నర్ ను కాదని ఢిల్లీ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. స్పష్టంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఢిల్లీ సీఎం డమ్మీగా మారిపోతారన్నమాట.
Mamata Banerjee
TMC
Arvind Kejriwal
AAP
Lieutenant Governor
CM Powers
Lok Sabha
BILL

More Telugu News