Astrazeneca: ఆస్ట్రాజెనెకా వల్ల భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదు: నీతి ఆయోగ్

No concern as of now in india due to astrazeneca
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వి.కె.పాల్‌
  • దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేసేది లేదని స్పష్టీకరణ
  • దుష్ప్రభావాలపై ఆరా తీసి తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • పలు ఐరోపా దేశాల్లో ఆగిపోయిన టీకా పంపిణీ

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకా వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) వి.కె.పాల్ స్పందించారు. ఇప్పటి వరకు భారత్‌లో ఈ టీకా ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తినట్లు ఎక్కడా గుర్తించలేదని స్పష్టం చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

టీకా తీసుకున్న కొంత మంది రక్తం గడ్డకడుతున్నట్లు వార్తలు రావడంతో పలు ఐరోపా దేశాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆపేసిన విషయాన్ని పాల్‌ ఈ సందర్బంగా గుర్తుచేశారు. అయితే, కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే వ్యాక్సినేషన్‌ను నిలిపివేశామని ‘యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ)’ స్పష్టం చేసినట్లు తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆపేయొద్దని ప్రత్యేకంగా చెప్పిందని పేర్కొన్నారు. అయితే, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏమైనా దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మాత్రం నిలిపివేసే ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో దుష్ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వార్తల్ని ఎప్పటికప్పుడు ఆరా తీసి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న పలు ఐరోపా దేశాల్లో కొంతమందికి రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఈఎంఏ వద్దకు ఇలాంటివి 30 కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు స్పెయిన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, డెన్మార్మ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, లాత్వియాలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
Astrazeneca
Corona Virus
Niti Aayog
Corona vaccine
v k paul

More Telugu News