Saranga Dariya: 'సారంగ దరియా' పాట వివాదం సమసిపోయింది: శేఖర్ కమ్ముల, కోమలి సంయుక్త ప్రకటన

Sekhar Kammula and Komali joint statement on Saranga Dariya row
  • 'లవ్ స్టోరీ' చిత్రంలో హిట్టయిన సారంగ దరియా పాట
  • సారంగ దరియా పాటపై వివాదం
  • మీడియాకెక్కిన గాయని కోమలి
  • తాజాగా శేఖర్ కమ్ములతో భేటీ
  • తన పాట ఉపయోగించడం పట్ల అభ్యంతరంలేదన్న కోమలి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో 'సారంగ దరియా' పాట ఎంత హిట్టయ్యిందో, అదే స్థాయిలో వివాదానికి కారణమైంది. వాస్తవానికి 'సారంగ దరియా' పాటను ప్రజాబాహుళ్యానికి పరిచయం చేసింది జానపద గాయని కోమలి. అయితే, ఆ పాట పల్లవులను తీసుకుని 'లవ్ స్టోరీ' సినిమాలో సుద్దాల అశోక్ తేజతో రాయించారు.

కానీ, ఆ పాట ద్వారా తనకు ఎలాంటి ప్రయోజనం దక్కకపోవడం పట్ల కోమలి అసంతృప్తికి లోనైనట్టు వార్తలు వచ్చాయి. తనతో పాడించలేదని ఆమె ఆగ్రహం చెందినట్టు ప్రచారం జరిగింది. పలు టీవీ చానళ్లలో దీనిపై చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మొత్తమ్మీద 'సారంగ దరియా' పాట ఓ వివాదం రూపుదాల్చింది.

అయితే, ఈ పాటకు సంబంధించిన వివాదం సమసిపోయిందని, తమ మధ్య ఎంతమాత్రం భేదాభిప్రాయాలు లేవని దర్శకుడు శేఖర్ కమ్ముల, గాయని కోమలి సంయుక్తంగా ఓ ప్రకటన చేశారు. 'సారంగ దరియా' పాటను 'లవ్ స్టోరీ' చిత్రంలో ఉపయోగించుకోవడం పట్ల తనకెలాంటి అభ్యంతరం లేదని కోమలి స్పష్టం చేయగా, రాబోయే తన సినిమాల్లో కోమలితో పాడిస్తానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారు. ఇద్దరి మధ్య సమాచార లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని శేఖర్ కమ్ముల అన్నారు.

'లవ్ స్టోరీ' సినిమాలో 'సారంగ దరియా' పాట పాడలేకపోయానన్న బాధ ఉండేదని, అయితే 'లవ్ స్టోరీ 'ఆడియో ఫంక్షన్ లో తనతో 'సారంగ దరియా' పాట పాడిస్తానని శేఖర్ కమ్ముల చెప్పారని కోమలి వెల్లడించింది.
Saranga Dariya
Sekhar Kammula
Komali
Love Story

More Telugu News