Kewal Krishan: 1918లో స్పానిష్ టీకా తీసుకున్న కేవల్ క్రిషన్‌కు కరోనా టీకా!

107 year old Kewal Krishan taken Covieshield vaccine
  • ఐదేళ్ల వయసులో స్పానిష్ టీకా తీసుకున్న కేవల్ క్రిషన్
  • ఏడాది తర్వాత తొలిసారి బయటకు వచ్చిన క్రిషన్
  • రాజ్యాంగ పరిషత్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన కేవల్ క్రిషన్

1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ నుంచి రక్షణ కోసం టీకా తీసుకున్న రాజ్యాంగ పరిషత్ కమిటీ సభ్యుడు కేవల్ క్రిషన్‌ ఇప్పుడు కరోనా టీకా తీసుకున్నారు. ఆయన వయసు 107 సంవత్సరాలు. ఢిల్లీలో నిన్న ఆయన కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. గతేడాది విధించిన కరోనా లాక్ డౌన్ తర్వాత ఇంటికే పరిమితమైన ఆయన తొలిసారి టీకా కోసం బయటకు వచ్చినట్టు కేవల్ క్రిషన్‌ కుమారుడు అనిల్ కృష్ణ తెలిపారు. ఆయన కొవిషీల్డ్ టీకా తీసుకున్నట్టు చెప్పారు.

వైరస్ వెలుగు చూసిన తర్వాత ఆయనను పూర్తి రక్షణ మధ్య ఉంచామని అనిల్ తెలిపారు. 2019లో ఆయనకు పెద్ద ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడదే ఆసుపత్రికి ఆయనను కారులో తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించామని వివరించారు. టీకా వేయించుకున్న తర్వాత ఆయనలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు కనిపించలేదని, బాగానే ఉన్నారని 72 ఏళ్ల అనిల్ కృష్ణ తెలిపారు.

1918లో స్పానిష్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తాను ఐదేళ్ల బాలుడినని తండ్రి తనతో చెప్పేవారని అనిల్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారని, కంటి చూపు మందగించిందని, వినికిడి శక్తి కూడా తగ్గిందని తెలిపారు. కాగా, కేవల్ క్రిషన్‌ రాజ్యసభ డిప్యూటీ కార్యదర్శిగానూ పనిచేశారు.

  • Loading...

More Telugu News