Myanmar: మయన్మార్ లో రక్తపాతం.. చైనా ఫైనాన్స్ చేస్తున్న ఫ్యాక్టరీలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు!

Chinese Financed Factories Set On Fire In Myanmar
  • ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్న సైన్యం
  • సైన్యానికి పూర్తి స్థాయిలో చైనా సపోర్ట్ 
  • ప్రజలను కాల్చి చంపుతున్న సైనిక ప్రభుత్వం

ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చి, పాలనను ఆ దేశ సైన్యం చేతిలోకి తీసుకున్న తర్వాత మయన్మార్ అట్టుడుకుతోంది. సైనిక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలకు దిగుతున్న ప్రజలపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. దొరికినవారిని దొరికినట్టు అరెస్టులు చేస్తోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంటోంది.

మరోవైపు భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోవడం షాక్ కు గురి చేస్తోంది. మయన్మార్ లోని ప్రధాన నగరమైన హ్లెయింగ్తాయా ఇండస్ట్రియల్ ఏరియాలో చైనా ఫైనాన్స్ చేస్తోన్న ఫ్యాక్టరీలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆ సందర్భంగా బలగాలు జరిపిన కాల్పుల్లో 22 మంది చనిపోయారు. ఇతర ప్రాంతాల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ స్థాయిలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ ఘటనపై మయన్నార్ లోని చైనా దౌత్యకార్యాలయం స్పందిస్తూ, నిరసనకారుల దాడుల్లో పలువురు చైనా సిబ్బంది గాయపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ప్రజలు, ఆస్తులను మయన్మార్ కాపాడాలని కోరింది. మయన్మార్ ను హస్తగతం చేసుకున్న సైన్యానికి చైనా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోందని అన్ని దేశాలు భావిస్తున్న సంగతి గమనార్హం.

మరోవైపు, ఈ ఘటనను కవర్ చేసిన ఒక ఫొటో జర్నలిస్టు మాట్లాడుతూ... 'అది చాలా భయంకరం. నా కళ్ల ముందే ప్రజలను కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను' అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన పేరును వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో ఆ నగరంతో పాటు, పొరుగు జిల్లాలో కూడా మార్షల్ లాను విధించారు. ఈ సందర్భంగా సైన్యానికి చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ, దాడులకు పాల్పడిన వారంతా దేశ ప్రజలకు శత్రువులే అని అన్నారు. ఆందోళనలు చేపట్టేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

మరోవైపు సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 126కు పెరిగిందని అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏఏపీపీ) వెల్లడించింది. 2 వేలకు పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News