Manchu Vishnu: రాజకీయ కారణాల వల్ల ఎవరూ ముందుకు రావడం లేదు: మంచు విష్ణు

Manchu Vishnu comments on Vizag Steel Plant
  • విశాఖకు వెళ్లిన మంచు విష్ణును అడ్డుకున్న స్టీల్ కార్మికులు
  • తమ పోరాటానికి టాలీవుడ్ మద్దతు ప్రకటించాలని డిమాండ్
  • మద్దతు ప్రకటించాలని సినీ ప్రముఖులకు ఉందన్న విష్ణు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పోరాటానికి మద్దతు పలకడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా విశాఖ స్టీల్ ప్లాంటుకు తన మద్దతు ప్రకటించారు. అయితే, ఇతర సినీ ప్రముఖులెవరూ దీనిపై స్పందించకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.

ఈ క్రమంలో, సినీ నటుడు మంచు విష్ణుకు స్టీల్ ప్లాంట్ సెగ తగిలింది. తన తాజా చిత్రం 'మోసగాళ్లు' కోసం తన టీమ్ తో కలిసి విష్ణు వైజాగ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా విష్ణును ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వినతిపత్రాన్ని అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని... లేకపోతే వైజాగ్ కు సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు ప్లాంటును లాభాల్లో నడుపుతామని చెపుతున్నప్పుడు... ఆ పని ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని సినీ ప్రముఖులకు ఉందని... కానీ, రాజకీయ కారణాలతో ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. సినీ పెద్దలు దీనిపై తీసుకునే నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు.
Manchu Vishnu
Vizag
Vizag Steel Plant
Tollywood

More Telugu News