Mithali Raj: క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన మిథాలిరాజ్‌.. అరుదైన రికార్డు!

 Mithali Raj becomes first Indian batswoman to score 10000
  • క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు
  • తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలికి క్రెడిట్  
  • ప్ర‌పంచంలో ఆ ఘ‌న‌త సాధించిన రెండో క్రికెట‌ర్
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్ప‌టికే ఎంతో పేరు ప్ర‌ఖ్యాతు‌లు సంపాదించుకున్న టీమిండియా మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ఖాతాలో మ‌రో అరుదైన‌ రికార్డు చేరింది. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు సాధించి తొలి భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది.

నిన్న‌టి వ‌ర‌కు ఆమె ఖాతాలో 9,965 పరుగులు ఉండేవి. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో ఆమె 35  పరుగులు చేయ‌డంతో ఈ రికార్డు ఆమె సొంతమైంది. అనంత‌రం మ‌రో ప‌రుగు చేసిన తర్వాత ఆమె ఔట్ అయింది. 1999లో భార‌త‌ మ‌హిళా క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలి రాజ్ ప్ర‌పంచంలోనే మేటి మహిళా క్రికెటర్లలో ఒక‌రిగా పేరు తెచ్చుకుంది.  

ఆమె టెస్టుల్లో 10 మ్యాచులు ఆడి 663 పరుగులు, వన్డేల్లో 212 మ్యాచులు ఆడి  6,974, టీ20ల్లో 89 మ్యాచ్‌లు ఆడి 2,364 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం ఆమె వన్డేల్లో మాత్రమే ఆడుతోంది. కాగా, ప్ర‌పంచంలో 10,000 ప‌రుగులు సాధించిన మ‌హిళా క్రికెట‌ర్ల జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ 10,273 పరుగులతో  అగ్ర‌స్థానంలో ఉంది.

ఆమె త‌ర్వాతి స్థానంలో మిథాలి రాజ్‌ 10,001 ప‌రుగుల‌తో ఉంది. దీంతో మిథాలీ రాజ్ నంబ‌ర్ 1 స్థానానికి ఎగ‌బాకే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ జాబితాలో మూడో స్థానంలో న్యూజిలాండ్‌ క్రికెట్ విమెన్‌ సుజీ బేట్స్‌(7,849 ప‌రుగులు), నాలుగో స్థానంలో వెస్టిండీస్ కు చెందిన‌‌ స్టిఫానీ టేలర్‌(7,816), ఐదో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ మెగ్‌ లానింగ్‌ (6,900) ఉన్నారు.
Mithali Raj
India
Cricket

More Telugu News