Mumbai: మరో ‘ఏకశిల’ ప్రత్యక్షం.. ఈసారి ముంబై పార్కులో దర్శనం!

Indias Second Mysterious Monolith Appears In Mumbai Park
  • ముంబై జాగర్స్ పార్క్ లో వెలసిన నిర్మాణం
  • ట్వీట్ చేసిన ముంబై కార్పొరేటర్
  • ప్రకృతి, వన్యప్రాణి సంరక్షణపై సందేశం
  • గత ఏడాది అహ్మదాబాద్ లో కనిపించిన వైనం
పోయినేడాది డిసెంబర్ లో అహ్మదాబాద్ పార్క్ లో స్టీల్ తో చేసిన ఓ ఏకశిల ప్రత్యక్షమైంది గుర్తుందా? మూడు అంచులుండి.. చూడడానికి అచ్చం పట్టకంలా కనిపించే ఆకారమది. మొదట అదెలా వచ్చిందో జనానికి అర్థం కాలేదు. పైగా దాని మీద అర్థం కాని భాషలో ఓ కోడ్ ఉండడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత దానిని తామే ఏర్పాటు చేయించామంటూ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. పార్కుకు వచ్చే వారి కోసమే దానిని పెట్టించామని చెప్పింది.

ఇప్పుడు అచ్చం అలాంటిదే మరో ఏకశిల ముంబై పార్కులోనూ దర్శనమిచ్చింది. బాంద్రాలోని జాగర్స్ పార్క్ లో వెలిసింది. దానికి సంబంధించిన ఫొటోలను స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ ఆసిఫ్ జకారియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాని మీద కొన్ని అంకెలున్నాయని, అవేంటో తేలుద్దామని ట్వీట్ చేశారు.

పట్టకం ఆకారంలో ఉన్న ఆ స్టీల్ ఏకశిల నిర్మాణం ఓ వైపున ఉన్న అంకెలు.. ప్రకృతి, వన్యప్రాణి సంరక్షణపై మంచి సందేశాన్నిస్తాయన్నారు. అది ఎప్పటిదాకా ఉంటుందో తెలియదని, అందరూ వెళ్లి చూడాలని సూచించారు. అయితే, దీనిపై ఇప్పటిదాకా బృహన్ ముంబై కార్పొరేషన్ స్పందించలేదు. అహ్మదాబాద్ కార్పొరేషన్ లాగా.. దీన్ని కూడా తామే ఏర్పాటు చేశామంటూ ప్రకటిస్తుందేమో చూడాలి మరి.

కాగా, ప్రపంచంలో ఇప్పటిదాకా ఇలాంటి ఏకశిలలు 30కిపైగా దేశాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే మాయమైపోయాయి. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని యూటాలో ఉన్న ఎడారి ప్రాంతంలో కనిపించింది. కొన్ని రోజులకే అది కనిపించకుండా పోయింది.
Mumbai
Maharashtra
Gujarath
Ahmedabad
Monolith

More Telugu News