Hyderabad: హైదరాబాదులో డబుల్ డెక్కర్ బస్సులు.. టెండర్లకు ఆహ్వానం!

Ashok Leyland bids for double decker busses in Hyderabad
  • డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ ప్రవేశపెట్టాలని కేటీఆర్ కు ఓ పౌరుడి విన్నపం
  • టెండర్లను ఆహ్వానించిన ఆర్టీసీ
  • టెండర్ దాఖలు చేసిన అశోక్ లేలాండ్
హైదరాబాదులో ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ బస్సులను ఎక్కేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపేవారు. అయితే ఆ తర్వాత కాలంలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి. నగరంలో ఫ్లైఓవర్లు రావడంతో వాటి ప్రయాణాలకు అడ్డంకిగా మారింది. ఈ బస్సులను పక్కన పెట్టేయడానికి ఇదొక ప్రధాన కారణం.

అయితే, మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టాలంటూ మంత్రి కేటీఆర్ కు ఓ పౌరుడు ఇటీవల విజ్ఞప్తి చేశాడు. ఈ విన్నపం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తాను డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన అనుభూతులను గుర్తుకు తెచ్చుకున్నారు. అంతేకాదు అనువైన రూట్లలో ఈ బస్సులను తిప్పే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఆర్టీసీ అధికారులను కోరారు.

కేటీఆర్ స్పందించిన వెంటనే రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ రంగంలోకి దిగారు. డబుల్ డెక్కర్ బస్సుల కోసం టెండర్లను ఆహ్వానించారు. తొలి దశలో 25 బస్సులు కావాలని ఆర్టీసీ కోరింది. బస్సులను సమకూరుస్తామని అశోక్ లేలాండ్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. ఈ సంస్థ వేసిన టెండర్ పై ఆర్థిక కమిటీ చర్చించి, ఆమోద ముద్ర వేయనుంది. కమిటీ ఓకే చేస్తే త్వరలోనే మళ్లీ హైదరాబాదీలు డబుల్ డెక్కర్ బస్సులో తిరిగే అవకాశం వస్తుంది.
Hyderabad
Double Decker Bus
Tenders

More Telugu News