Vanidevi: మాజీ ప్రధాని పీవీకి, సీఎం కేసీఆర్ కు ఎన్నో పోలికలున్నాయి: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి

TRS MLC Candidate Vanidevi compares CM KCR with her father Late PV Narasimharao
  • టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె వాణీదేవికి టికెట్
  • సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించిన వాణీదేవి
  • పీవీ దేశాన్ని గట్టెక్కించారని వెల్లడి
  • కేసీఆర్ తెలంగాణను కాపాడారని కితాబు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పీవీ నరసింహారావుకు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అనేక అంశాల్లో సారూప్యత ఉందని తెలిపారు. తన తండ్రి పీవీ రైతు అని, సీఎం కేసీఆర్ కు కూడా వ్యవసాయం అంటే ఎంతో మక్కువ అని వివరించారు. పీవీ సంస్కరణాభిలాషి అని, కేసీఆర్ కూడా సంస్కరణలు కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు.

తన తండ్రికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నా, మాతృభాష, యాస ఎప్పుడూ విడిచిపెట్టలేదని వాణీదేవి అన్నారు. ఇంటికి వస్తే ఆయన తెలంగాణ యాసలోనే మాట్లాడేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా భాష కోసం, యాస కోసం ఎంతో తాపత్రయం చూపుతారని, భాష, యాస మనుగడను ఆయన పరిరక్షించారని కొనియాడారు. తెలంగాణ భాషనే అసలైన తెలుగు భాషగా చెప్పే స్థాయికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. పీవీ, కేసీఆర్ ఇద్దరూ సాహిత్యం పట్ల అభిలాష ఉన్నవారేనని వాణీదేవి వివరించారు. నాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వ్యక్తి పీవీ అయితే, తెలంగాణను సాధించి, రక్షించిన మహానుభావుడు కేసీఆర్ అని ఆమె కీర్తించారు.
Vanidevi
TRS MLC Candidate
PV Narasimharao
CM KCR
Telangana
TRS

More Telugu News