Vaccine: కో-మార్బిడిటీస్ సర్టిఫికెట్ ఉంటేనే 45 ఏళ్లు పైబడిన వారికి టీకా!

2nd Phase Vaccination Drive starts in India on March 1st
  • 60 ఏళ్లు, అంతకు పైబడిన వారు, 45 ఏళ్లు పైబడి కో-మార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారికి టీకా
  • ప్రైవేటు కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్
  • రూ. 300 ఉండే అవకాశం
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటికే తొలి విడత పూర్తిచేసుకుంది. ఇప్పటి వరకు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇచ్చారు. మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ విడతలో సామాన్యులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, 60 ఏళ్లు, అంతకుపైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ కలిసి 27 కోట్ల మందికిపైగా ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరిలో 10 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వృద్ధులే ఉంటారని చెబుతున్నారు.

10 వేల టీకా కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుండగా, 20 వేల ప్రైవేటు కేంద్రాల్లో కొంత రుసుము వసూలు చేసి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అది ఎంత అన్నదానిలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల (కో-మార్బిడిటీస్) జాబితాలోకి వచ్చేవి ఏవన్న దాంట్లోనూ క్లారిటీ లేదు. ఈ రెండింటిపై ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కో-మార్బిటీస్‌తో బాధపడుతూ టీకా తీసుకోవాలనుకునే వారు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది.

గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ వ్యాధులతో పాటు మధుమేహం, కేన్సర్‌, తీవ్ర ఆస్తమా, మానసిక రుగ్మతలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటాన్ని కో-మార్బిడిటీస్‌గా పరిగణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే,  ఎముక మజ్జ, స్టెమ్‌ సెల్‌, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారూ ఈ విభాగంలోకే వచ్చే అవకాశం ఉంది. ఇక, టీకా ధరను రూ. 300గా నిర్ణయిస్తారని అంచనా వేస్తున్నారు.
Vaccine
Corona Virus
Vaccination Drive
India
2nd Phase

More Telugu News