Etela Rajender: అప్రమత్తంగా ఉన్నాం.. ఇప్పటికైతే కర్ఫ్యూ విధించే ఆలోచన లేదు: ఈటల

There is no plan of imposing curfew says Etela Rajender
  • మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాలపై దృష్టి సారించాం
  • తెలంగాణలో మళ్లీ కేసులు పెరగలేదు
  • ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి
మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రాల మధ్య రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో వైరస్ ఇతర రాష్ట్రాల్లో మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. వైద్యశాఖ అధికారులను అలర్ట్ చేశామని తెలిపారు. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాలపై దృష్టి సారించామని చెప్పారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామని తెలిపారు.

తెలంగాణలో మళ్లీ కేసులు పెరగలేదని ఈటల చెప్పారు. దీంతో, ఇప్పటికైతే మళ్లీ కర్ఫ్యూ విధించాలనే ఆలోచన లేదని తెలిపారు. కరోనా ఉన్నంత కాలం ప్రజలంతా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా డోసులు వచ్చాయని... దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, 50 ఏళ్లు దాటినవారికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. హైదరాబాదులోని గాంధీ, నిమ్స్, టిమ్స్ ఆసుపత్రుల్లో మళ్లీ పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కర్ణాటక, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
Etela Rajender
TRS
Corona Virus
New Cases
Curfew

More Telugu News