Pawan Kalyan: జన్మనిచ్చిన అమ్మను మర్చిపోగలమా?... అమ్మ నేర్పిన భాష కూడా అంతే: పవన్ కల్యాణ్
- నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- అమ్మభాష విలువను గుర్తెరగాలన్న పవన్
- తెలుగు భాషను దూరం చేసే ప్రయత్నాలు విడనాడాలని హితవు
- ఇతర భాషలను కూడా గౌరవించాలని పిలుపు
ఇవాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష ఔన్నత్యాన్ని, అమ్మ భాష విలువను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. జన్మనిచ్చిన అమ్మను మర్చిపోలేమని, అలాగే అమ్మ నేర్పిన భాషను కూడా మర్చిపోకూడదని పేర్కొన్నారు. జీవితంలోని ప్రతి అనుబంధం, ఆత్మీయత, ఆత్మ ముడిపడి ఉండేది అమ్మ భాషతోనే అని వివరించారు.
ఉరుకుల పరుగుల జీవితంలో మాతృభాషతో అభివృద్ధి సాధంచలేమని, ఉద్యోగాలు పొందలేమని అనుకోవడం కేవలం భ్రమేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆలిండియా ఉద్యోగ సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి ఉద్యోగాల పరీక్షలను మాతృభాషలోనే రాసి విజయం సాధిస్తున్న వారు కూడా ఉన్నారని ఈ సందర్భంగా ఉదహరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ఒక్క మాతృభాషకే సాధ్యమని స్పష్టం చేశారు.
భావితరాలకు బాల్యం నుంచే తెలుగు భాషను దూరం చేసే ప్రయత్నాలను పాలకులు విడనాడాలని పవన్ హితవు పలికారు. ఎవరి మాతృభాషను వారు ఆదరిస్తూనే, ఇతర భాషలను గౌరవించాలని పిలుపునిచ్చారు. పాలకుల్లో ఈ తరహా సంకల్పం బలపడితేనే మాతృభాషకు పట్టం కట్టగలమని తెలిపారు.