సీఎం పదవిపై ఆసక్తి చూపిస్తున్న 'మెట్రో మ్యాన్'
- మెట్రోమ్యాన్ గా గుర్తింపు పొందిన శ్రీధరన్
- బీజేపీలో చేరేందుకు సన్నాహాలు
- పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని వెల్లడి
- గవర్నర్ పదవిపై ఆసక్తి లేదన్న శ్రీధరన్
- ఆ పదవితో రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యలు
కేరళలో బీజేపీని అందలం ఎక్కించడమే పరమావధిగా శ్రమిస్తానని, ఈ క్రమంలో పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు కూడా తాను సిద్ధమేనని తన మనోగతం వెల్లడించారు. ఒకవేళ తాను కేరళ ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకే అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గవర్నర్ పదవిపై తనకు ఏమంత ఆశ లేదని, ఆ పదవితో రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం ఏమంత ఉండదని శ్రీధరన్ అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, తాను బీజేపీలో ఎందుకు చేరాలనుకుంటున్నాడో కూడా శ్రీధరన్ వివరణ ఇచ్చారు. కేరళను ఎల్డీఎఫ్ (సీపీఎం), ఎల్డీఎఫ్ (కాంగ్రెస్) ఎన్నో ఏళ్లుగా పాలిస్తున్నాయని, కానీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. ఈ రెండు పార్టీలు కేరళను అభివృద్ధి చేయలేకపోయాయని, అందుకే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.