AIIMS: ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్: ఎయిమ్స్

AIIMS Director Dr Randeep Guleria receives second dose of Covid vaccine
  • జనవరి 16న దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్
  • మార్చి, ఏప్రిల్ నాటికి మార్కెట్లోకి టీకా వస్తుందన్న సీరం సీఈవో పూనావాలా
  • దేశంలో నెల రోజుల్లో 90 లక్షల మందికి టీకా
ఈ ఏడాది చివరి నాటికి కరోనా టీకా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. తొలి దశ టీకా లక్ష్యాలు పూర్తయిన అనంతరం బహిరంగ మార్కెట్లోకి టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అప్పుడు సాధారణ ప్రజలు కూడా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న గులేరియా అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

మరోవైపు, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా మాట్లాడుతూ..  మార్చి, ఏప్రిల్ నాటికే కరోనా టీకా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకేపాల్ కూడా ఇదే విషయం చెప్పారు. జూన్, జులై నాటికి ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.

కాగా, దేశంలో ఈ ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా తొలి డోసు పంపిణీ ప్రారంభమైంది. ఈ దశలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన తర్వాత నెల రోజుల్లో 90 లక్షల మందికి టీకాలు వేశారు. ఈ లెక్కన 30 కోట్ల మందికి టీకాలు వేసేందుకు ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అంచనా.
AIIMS
Corona Vaccine
India
Randeep Guleria

More Telugu News