Balakrishna: మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు: నందమూరి బాలకృష్ణ

Balakrishna warns YCP leaders while his visit in Hindupur constituency
  • హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పర్యటన
  • ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
  • వైసీపీపై ఆగ్రహం
  • తమను బెదిరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నేడు తన నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు అని వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

తమను బెదిరించాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, తప్పకుండా బదులు తీర్చుకుంటామని బాలయ్య హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని స్పష్టం చేశారు. హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు. వైసీపీ అనుసరిస్తున్న తీరు టీడీపీకే కాదని, యావత్ సమాజానికి ప్రమాదకరం అని అభిప్రాయపడ్డారు.

వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాల మాటేమో గానీ, మద్యం, గంజాయి వంటివి మాత్రం అందుబాటులో ఉన్నాయని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. కాగా ఇవాళ హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి మద్దతిస్తున్న 100 కుటుంబాలు బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరాయి. బాలయ్య రాకతో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Balakrishna
YSRCP
Hindupur
Gram Panchayat Elections
Telugudesam

More Telugu News