Indian Government: నాలుగు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేయనున్న కేంద్రం.. త్వరలోనే ప్రక్రియ ప్రారంభం?

4 Mid Sized Government Banks Shortlisted For Privatisation
  • ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రం
  • తాజాగా బ్యాంకింగ్ సెక్టార్ పై దృష్టి
  • తొలుత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను అమ్మేసే అవకాశం
ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక వార్త వెలుగులోకి వచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్ ను కూడా ప్రైవేటుపరం చేసే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని... ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు ప్రభుత్వ బ్యాంకులను అమ్మేందుకు రంగం సిద్ధమవుతోందని తమకు ఇద్దరు ఉన్నతాధికారులు వెల్లడించినట్టు రాయిటర్స్ తెలిపింది.

తొలి విడతలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను షార్ట్ లిస్ట్ చేసినట్టు పేర్కొంది. ఈ నాలుగు బ్యాంకుల్లో రెండింటిని 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే అమ్మేస్తారని అధికారులు తెలిపినట్టు పేర్కొంది.

తొలుత చిన్న బ్యాంకులు, మధ్య తరగతి బ్యాంకులను ప్రైవేటైజ్ చేసి, ప్రజా స్పందనను తెలుసుకునే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో పెద్ద బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేసేస్తారని తెలిపారు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రం ప్రభుత్వం అత్యధిక వాటాను ఉంచుకుంటుందని చెప్పారు. అయితే ఈ వార్తపై స్పందించేందుకు ఆర్థికశాఖకు చెందిన ఒక అధికార ప్రతినిధి నిరాకరించారు.

ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 వేల మంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33 వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తక్కువ ఉద్యోగులు ఉన్నందువల్ల తొలుత ఈ బ్యాంకును అమ్మేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో ఐదారు నెలల్లో ప్రైవేటైజేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని సమాచారం. ఇంకోవైపు బ్యాంకుల ప్రైవేటీకరణను బ్యాంకు యూనియన్లు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉంది.
Indian Government
BJP
Narendra Modi
Banks
Privatisation
Sale
Public Sector Banks

More Telugu News