Consumer Forum: శాకాహారం ఆర్డర్ చేస్తే చికెన్ తెచ్చినందుకు రూ.10 వేలు జరిమానా

Consumer forum fined a food startup ten thousand rupees
  • 2018లో బెంగళూరులో ఘటన
  • క్వినోవా సలాడ్ ఆర్డర్ చేసిన యువకుడు
  • చికెన్ వంటకం తీసుకువచ్చిన డెలివరీ బాయ్
  • వినియోగదారుల ఫోరంను ఆశ్రయించిన యువకుడు
  • 28 నెలల పాటు విచారణ
బెంగళూరులో ఓ ఆన్ లైన్ ఫుడ్ స్టార్టప్ కు కోర్టు జరిమానా విధించింది. విష్ణు బైతనారాయణ నాగేంద్ర అనే యువకుడు బెంగళూరులోని ఏఈసీఎస్ లేవుట్ లో నివసిస్తుంటాడు. 2018 ఏప్రిల్ 23న ఫ్రెష్ మెనూ అనే ఫుడ్ స్టార్టప్ లో క్వినోవా సలాడ్ కు ఆర్డర్ బుక్ చేశాడు. ఇది శాకాహార వంటకం. ఆ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ వంటకానికి సంబంధించిన ఓ బాక్స్ ను తీసుకువచ్చాడు. ఆ బాక్స్ పై శాకాహార వంటకం అని రాసి ఉంది. అయితే నాగేంద్ర తన ఫుడ్ పార్శిల్ ను విప్పదీయగా అందులో చికెన్ వంటకం ఉండడాన్ని గమనించాడు.

దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆ యువకుడు వెంటనే సదరు ఫుడ్ స్టార్టప్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆ సంస్థ ప్రతినిధి క్షమాపణలు తెలిపాడు. త్వరలోనే ఫుడ్ ఐటమ్ కు చెల్లించిన నగదు వాపసు చేస్తామని బదులిచ్చాడు. కానీ మతం రీత్యా మాంసాహారానికి దూరంగా ఉండే నాగేంద్రను ఈ సంస్థ పొరబాటు ఆగ్రహానికి గురిచేసింది. ఈ అంశంపై రెండుసార్లు ఆ ఫుడ్ స్టార్టప్ కు లీగల్ నోటీసులు జారీ చేసిన నాగేంద్ర, ఆపై జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

ఈ ఫోరంలో వాదనల సందర్భంగా ఫుడ్ స్టార్టప్ న్యాయవాదులు వితండవాదం చేశారు. ఆ యువకుడికి చికెన్ ఐటమ్ డెలివరీ చేశారనడానికి ఆధారాలేమున్నాయని వాదించారు. దాంతో ఆ స్టార్టప్ సిబ్బంది గతంలో క్షమాపణలు తెలుపుతూ చేసిన ఈమెయిల్ ను నాగేంద్ర తరఫు న్యాయవాది వినియోగదారుల ఫోరంకు సమర్పించాడు. దాంతో ఫుడ్ స్టార్టప్ తప్పిదానికి పాల్పడినట్టు గుర్తించిన ఫోరం... పరిహారంగా రూ.5 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు, ఫుడ్ ఐటమ్ ఖర్చు రూ.210ని నాగేంద్రకు చెల్లించాలంటూ ఫ్రెష్ మెనూ స్టార్టప్ ను ఆదేశించింది. కాగా, ఈ కేసులో 28 నెలల పాటు విచారణ సాగింది.
Consumer Forum
Food Startup
Nagendra
Fresh Menu
Bengaluru

More Telugu News