Chandrababu: నా రాజకీయ జీవితంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలపై సమీక్ష చేశా: చంద్రబాబు

Chandrababu reviews on two phases of AP Panchayat Elections
  • ఏపీలో పూర్తయిన రెండు విడతల పంచాయతీ ఎన్నికలు
  • అక్రమాలు జరిగాయన్న చంద్రబాబు
  • ప్రజల్లో భరోసా కల్పించాలని డిమాండ్
  • మొదట సర్పంచ్ ఓట్లు లెక్కించాలని సూచన
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలపై సమీక్ష చేశానని వెల్లడించారు. తొలి, రెండో విడత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఈ రెండు విడతల ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎన్నికల్లో ఏకగ్రీవాలతో లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు వీరోచితంగా ముందుకొచ్చారని వెల్లడించారు. తమ చొరవ వల్లే ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు.

ఇక, పోలింగ్ పూర్తయ్యాక హడావిడిగా ఓట్ల లెక్కింపు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మొదట సర్పంచ్ ఓట్లు లెక్కిస్తే సరిపోతుందని, ఆ తర్వాత వార్డు మెంబర్ల ఓట్లు లెక్కించాలని వివరించారు. కానీ అర్ధరాత్రి కూడా ఓట్ల లెక్కింపు కొనసాగిస్తూ, కరెంట్ కట్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏజెంట్లను బయటకు పంపి అక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాలు తారుమారు చేయడానికి, ఇష్టానుసారం ఫలితాలు ప్రకటించడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొన్నికోట్ల స్వస్తిక్ ముద్రలోనూ అవకతవకలు జరిగాయని అన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేయవచ్చు కదా... ప్రజాస్వామ్యానికి ఓ నమ్మకం వస్తుంది అని హితవు పలికారు.

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఈయన పులివెందులను మించిపోయాడని విమర్శించారు."రౌడీయిజం చేయడంలో నువ్వు నాయకుడివా? రౌడీయిజం చేసినవాళ్లను, మర్డర్లు చేసినవాళ్లను చరిత్రలో చాలామందిని చూశా. వాళ్లకు చివరికి అదే గతి పడుతుంది" అని స్పష్టం చేశారు.
Chandrababu
Gram Panchayat Elections
Review
Telugudesam
YSRCP

More Telugu News