YS Jagan: సీఎం సార్.. చూడండి.. సీఐ తుపాకి గురిపెట్టి చంపుతానంటున్నాడు: జగన్‌కు మార్కెట్ యార్డ్ చైర్మన్ సెల్ఫీ వీడియో

Rompicharla market yard chairman sends selfie video to ys jagan
  • ఎమ్మెల్యే గోపిరెడ్డి, సీఐ కృష్ణయ్య నుంచి తనను కాపాడాలంటూ వీడియోలో అభ్యర్థన
  • టీడీపీకి పనిచేసిన వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారని ఆరోపణ
  • తాను పోటీకి దిగడంతో సీఐతో కలిసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుంటూరు జిల్లా రొంపిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ అంజయ్య పంపిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. నరసరావుపేట టూటౌన్ సీఐ కృష్ణయ్య తనకు తుపాకి గురిపెట్టి చంపుతానని బెదిరిస్తున్నారని అందులో ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీకి పనిచేసిన వ్యక్తిని ఎమ్మెల్యే గోపిరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారని, దీంతో తొలి నుంచి వైసీపీలోనే ఉన్న తాము కూడా పోటీకి దిగానని పేర్కొన్నారు.

 అయితే, ఇది జీర్ణించుకోలేని ఎమ్మెల్యే సీఐ కృష్ణయ్యతో కలిసి వేధిస్తున్నారని ఆ వీడియోలో ఆరోపించారు. సీఐ తనకు తుపాకి గురిపెట్టి పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారని వాపోయారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, సీఐ కృష్ణయ్య నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడాలని అంజయ్య ఆ వీడియోలో వేడుకున్నారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మరోవైపు, గోగులపాడు నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్దేశిత సమయం ముగిసినా అంజయ్య ప్రచారం చేయడంతోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు రొంపిచర్ల పోలీసులు చెబుతుండగా, మేనల్లుడు లక్ష్మీనారాయణ రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడంతోనే సీఐ కృష్ణయ్య తన భర్తను తీసుకెళ్లారని అంజయ్య భార్య ఆరోపించారు.
YS Jagan
Rompicharla
Guntur District
Gram Panchayat Elections
Selfie Video

More Telugu News