హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరు?.. మరికాసేపట్లో ఉత్కంఠకు తెర!
- రెండు పదవులు టీఆర్ఎస్‌కే?
- బరిలోకి బీజేపీ, ఎంఐఎం
- 11 గంటలకు కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం
- అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకారం ఈ ఉదయం 10.45 గంటలకు కొత్తగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్ అఫీషియోలు సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది.11 గంటలకు వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 11.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు.
మరోవైపు, మేయర్ అభ్యర్థులను నిలబెడుతున్న టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అయితే, ప్రస్తుతం పార్టీల బలాబలాలను బట్టి చూసుకుంటే రెండు పదవులూ టీఆర్ఎస్‌కే దక్కే అవకాశం ఉంది. మేయర్ ఎన్నికకు 97 మంది సభ్యుల మద్దతు అవసరం. టీఆర్ఎస్ 56, బీజేపీకి 47 (గెలిచిన అభ్యర్థులలో ఒకరు చనిపోయారు. ఆయనను మినహాయించి), ఎంఐఎంకు 44 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. టీఆర్ఎస్‌కు 32 మంది, బీజేపీకి ఇద్దరు, ఎంఐఎంకి 10 మంది ఎక్స్ అఫీషియోలు ఉన్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ టీఆర్ఎస్‌కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.