SII: మరో కోటీ 45 లక్షల టీకా డోస్ లకు ఆర్డర్ ఇచ్చిన భారత్!

India Ordered another One Crore 45 Lakh Vaccine Doses
  • ఇండియాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
  • సీరమ్ కు కోటి డోస్ ల ఆర్డర్
  • భారత్ బయోటెక్ కు 45 లక్షల డోస్ ల ఆర్డర్
ఇండియాలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్నవేళ, భారత ప్రభుత్వం మరో కోటీ 45 లక్షల టీకా డోస్ లకు ఆర్డర్ ఇచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేస్తున్న ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కొవిషీల్డ్ కోటి డోస్ లు, దేశవాళీ సంస్థ భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ 45 లక్షల డోస్ లకు ఆర్డర్ ఇచ్చామని ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి రెండు డోస్ ల వ్యాక్సిన్ ఇచ్చేందుకు కట్టుబడివున్నామని, మార్చి నాటికి వయో వృద్ధులకు టీకా ఇవ్వడం మొదలవుతుందని అధికారులు వెల్లడించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న ఎస్ఐఐ ఇప్పటికే 1.10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సరఫరా చేయగా, జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల మంది ఫ్రంట్ లైన్ యోధులకు ఇచ్చే ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. వీరికి అవసరమైన రెండో డోస్ కూడా సిద్ధం అయింది. కాగా, ఈ టీకా డోస్ లను ఒక్కొక్కటి రూ. 200 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక సీరమ్ అందిస్తున్న కొవిషీల్డ్ 72 శాతం ప్రభావితమైనదని, కొవాగ్జిన్ తుది దశ ట్రయల్స్ ఫలితాలు మార్చిలోగా రావచ్చని ఔషధ నియంత్రణ విభాగం పేర్కొంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ, కాడిలా హెల్త్ కేర్ తయారు చేస్తున్న జైకోవ్-డీ వ్యాక్సిన్ లకు సమీప భవిష్యత్తులో అనుమతి లభించవచ్చని తెలిపింది.
SII
Covishield
COVAXIN
Vaccine
Order

More Telugu News